Telangana
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Quick Summary:
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నేటిసాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ అధ్యక్షతన ఆర్డీఓ రమణారెడ్డి తో కలసి రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, విద్యుత్, జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతి పనిని శాఖల మధ్య సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ పనులు, సాగునీటి ప్రాజెక్టులు, మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారుల పరిధిలోని సమస్యలపై అధికారులతో సవివరంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఎలాంటి అభివృద్ధి పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సకాలంలో అందేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పెండింగ్ పనుల పురోగతిని ఎమ్మెల్యేకు వివరించగా, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
