Telangana
*పోలీస్ స్టేషన్ ప్రజలకు తొలి న్యాయ వేదిక* * వెల్గటూర్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో డీఎస్పీ కె.పురుషోత్తం రెడ్డి * రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై కీలక ఆదేశాలు
Quick Summary:
పోలీస్ స్టేషన్ ప్రజలకు తొలి న్యాయ వేదిక
*వెల్గటూర్, జూన్ 27 (నేటి సాక్షి):* ప్రజలకు న్యాయం అందించే తొలి వేదిక పోలీస్ స్టేషన్ అని, స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సత్వర న్యాయం అందించేలా పనిచేయాలని జగిత్యాల సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (డీఎస్పీ) కె. పురుషోత్తం రెడ్డి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, స్టేషన్‌లో నిర్వహిస్తున్న జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్, సీసీటీఎన్‌ఎస్ నమోదు, కేసు ఫైళ్లు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, వారెంట్లు, సమన్లు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని రికార్డులను చట్టబద్ధంగా, పారదర్శకంగా, ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, బలహీన వర్గాలకు సంబంధించిన కేసులను అత్యంత సున్నితంగా, మానవీయ దృక్పథంతో విచారించాలని తెలిపారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ షీ-టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మహిళా రక్షణ చట్టాలు, సైబర్ భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, క్యూఆర్ కోడ్ మోసాలు, సోషల్ మీడియా మోసాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, పేకాట, జూదం, గుట్కా విక్రయాలు, ఇసుక అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయి ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామ సందర్శనలు నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువతతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి చిన్నచిన్న వివాదాలను చట్ట పరిధిలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మైనర్లు వాహనాలు నడపడంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచాలని సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి శాస్త్రీయ ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని, కోర్టుల్లో సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని, వారెంట్ల అమలు, పరారీలో ఉన్న నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని వెల్గటూర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, ఆయుధాల సంరక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. తనిఖీ అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన డీఎస్పీ నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజా సేవల మెరుగుదల, కమ్యూనిటీ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సమగ్రంగా సమీక్షించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచి నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, వెల్గటూర్ ఎస్సై పి.ఉదయ్ కుమార్, ధర్మపురి ఎస్సై మహేష్, బుగ్గారం ఎస్సై సతీష్, గొల్లపల్లి ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

