*నేటి సాక్షి – మెట్‌పల్లి ( నరసింహ రాధారపు )*...✍️
-------
*"రెవెన్యూ సేవల పేరుతో ప్రజల నుంచి లంచాలు వసూలు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి కొరడా ఝళిపించింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ పాలన అధికారి (జీపీఓ) మాతె రాజేష్ (37) పట్టాదారు పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించిన విచారణ నివేదికను ఉన్నత రెవెన్యూ అధికారులకు పంపించేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా గురువారం కరీంనగర్ ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ సేవలను లంచాలతో ముడిపెట్టి అధికారిక హోదాను దుర్వినియోగం చేసిన అధికారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.!"*
___________________________
*పాస్‌బుక్'లో పేరు సవరణకు 'రేటు'*
ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం... ఆత్మకూర్ గ్రామానికి చెందిన బాధితుడు మల్లేష్ తన తండ్రి పేరిట ఉన్న సుమారు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. దీంతో తండ్రి పేరు నుంచి తన పేరిట నమోదు చేసుకునే ప్రక్రియలో పట్టాదారు పాస్‌బుక్‌లో పేరు సవరణ అవసరమైంది. ఈ క్రమంలో తహశీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించగా, గ్రామ పాలన అధికారి నుంచి విచారణ నివేదిక తప్పనిసరిగా రావాలని అధికారులు సూచించారు. దీంతో జీపీఓ మాతె రాజేష్‌ను సంప్రదించగా, ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించాలంటే రూ.5 వేల లంచం ఇవ్వాలని స్పష్టంగా డిమాండ్ చేసినట్లు తెలిసింది.
*ఏసీబీ ఉచ్చు... బ్యాగ్‌లోనే నగదు*
అయితే..విధి నిర్వహణలో భాగంగా ఉచితంగా చేయాల్సిన పనికి..లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో డీఎస్పీ మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఆత్మకూర్ గ్రామ పాలన కార్యాలయంలో ఉచ్చు బిగించారు. ముందస్తు సూచనల మేరకు బాధితుడు తీసుకెళ్లిన రూ.5 వేల నగదును నేరుగా చేతికి తీసుకోకుండా తన హ్యాండ్‌బ్యాగ్‌లో వేయాలని మాతె రాజేష్ ఆదేశించాడు. ఫిర్యాదుదారుడు నగదును బ్యాగ్‌లో ఉంచిన వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
*రసాయన పరీక్షలో పాజిటివ్.!*
దాడి అనంతరం అధికారులు నిర్వహించిన రసాయన పరీక్షలో నిందితుడి 'హ్యాండ్‌బ్యాగ్‌పై పాజిటివ్' ఫలితం వచ్చింది. దీంతో లంచం స్వీకరించినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. రూ.5 వేల ముద్రిత నోట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందినట్లు ఏసీబీ నిర్ధారించింది.
*తహశీల్దార్ కార్యాలయంలో కలకలం*
ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మెట్‌పల్లి తహశీల్దార్ కార్యాలయానికి తరలించి గంటలపాటు విచారణ నిర్వహించారు. ఈ పరిణామంతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించడంతో అక్కడున్న కొందరు సిబ్బంది బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. విచారణ సందర్భంగా సంబంధిత రికార్డులు, భూ దస్త్రాలను కూడా అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.
*కోర్టుకు తరలింపు... దర్యాప్తు కొనసాగింపు* : ఏసీబీ డీఎస్పీ మహేందర్
ఏసీబీ అధికారులు మాతె రాజేష్‌ను అరెస్ట్ చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక ఎస్‌పీఈ & ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే మరిన్ని కోణాల్లో విచారణ చేపడతామని వెల్లడించారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
*లంచం అడిగితే వెంటనే 1064కు సమాచారం*
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి 1064 టోల్‌ఫ్రీ నంబర్, వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ Telangana ACB, ఎక్స్ @TelanganaACB ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఏసీబీ క్యూ ఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ మరోసారి స్పష్టం చేసింది.కాగా.. ఆత్మకూరులో 'ఏసీబీ' అధికారుల వలకు అవినీతి 'పంచాయతీ' చేప చిక్కిందటన్న సమాచారం కోరుట్ల నియోజకవర్గంలో కలకలం రేపింది.!
______________________________
Telangana
*'ఏసీబీ' వలకు చిక్కిన.. అవినీతి 'పంచాయతీ' చేప.!* --------------------------- * లంచం కోసం అధికార దుర్వినియోగం చేసిన గ్రామ పాలన అధికారి 'మాతె రాజేష్' * పట్టాదారు పాస్‌బుక్‌లో పేరు సవరణ నివేదికకు రూ.5 వేల డిమాండ్ * హ్యాండ్‌బ్యాగ్‌లో నగదు పెట్టించుకుని రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన జీపీఓ * మెట్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో గంటలపాటు విచారణ... * ఏసీబీ అధికారుల రాకతో రెవెన్యూ సిబ్బందిలో కలకలం * నిందితుడిని అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలింపు * 1064కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపు ------------
Quick Summary:
*'ఏసీబీ' వలకు చిక్కిన.. అవినీతి 'పంచాయతీ' చేప.!* ---------------------------



