Telangana
*నారు మడికి రక్షణగా గులాబీ జెండాలు* * బీఆర్ఎస్‌పై అభిమానాన్ని చాటుకున్న గుల్లకోట రైతు
Quick Summary:
నారు మడికి రక్షణగా గులాబీ జెండాలు
*ఎండపల్లి, జూన్ 27 (నేటి సాక్షి):* జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామ శివారులో ఓ రైతు తన వరి నారు మడికి రక్షణగా గులాబీ జెండాలను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. గ్రామానికి చెందిన జెల్లెల కనకయ్య జగిత్యాల–రాజారాంపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న తన వ్యవసాయ భూమిలో వరి సాగు చేస్తున్నాడు. సాధారణంగా రైతులు నారు పోసిన అనంతరం పక్షులు, ఇతర జీవరాశుల నుంచి నారును రక్షించేందుకు కర్రలు, వలలు, ప్లాస్టిక్ పట్టీలు తదితర ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే కనకయ్య మాత్రం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తన నారు మడి చుట్టూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన గులాబీ జెండాలను ఏర్పాటు చేశాడు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ పొలం వద్ద రెపరెపలాడుతున్న గులాబీ జెండాలు అటుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు, రైతుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కనకయ్య బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు వీరాభిమాని అని, గత ప్రభుత్వ హయాంలో రైతులకు లభించిన సంక్షేమ పథకాలు, వ్యవసాయానికి అందిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ తన అభిమానానికి గుర్తుగా ప్రతి ఏడాది నారు మడికి గులాబీ జెండాలను రక్షణగా ఏర్పాటు చేస్తుంటాడని స్థానిక రైతులు తెలిపారు. ఈ వినూత్న విధానం ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది.