Telangana
*'సర్' ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి* - - ధర్మపురి ఈఆర్వో జి.నరసింహరావు * తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష * షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశం
Quick Summary:
సర్' ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి
ఎండపల్లి, జూన్ 27 (నేటి సాక్షి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–Special Intensive Revision) ప్రక్రియను పారదర్శకంగా, తప్పులులేకుండా ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ధర్మపురి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో), మెట్‌పల్లి ఆర్డీవో జి.నర్సింహారావు అధికారులను ఆదేశించారు. శనివారం ఎండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మండలంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ పురోగతిని ఆయన సమీక్షించారు. తహశీల్దార్ ఎడ్ల అనిల్‌కుమార్, ఎంపీడీవో కృపాకర్, గిర్ధావర్ తొడేటి అన్వేష్, బీఎల్‌ఓ, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ అండాలు నుంచి గ్రామాల వారీగా ఇంటింటి సర్వే, ఓటర్ల నమోదు, వివరాల ధృవీకరణ, ఫారాల పంపిణీ, స్వీకరణలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా అత్యంత కీలకమని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వేలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి కుటుంబాన్ని తప్పనిసరిగా సందర్శించి, ఓటర్ల వివరాలను సంబంధిత ఆధారాలతో క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. కొత్తగా అర్హత పొందిన ఓటర్లను నమోదు చేయడంతో పాటు మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సరిచూడాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కల్పిస్తూ, ఫిర్యాదులు, అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు సమన్వయంతో పనిచేసి ప్రతి దశను షెడ్యూల్ ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన చోట క్షేత్రస్థాయిలో మరింత పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.