నేటి సాక్షి గజ్వేల్ : ---
ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి రైల్వే అనుసంధానం కల్పించే దిశగా కీలక అడుగు పడింది. మనోహరాబాద్–సిద్దిపేట రైల్వే మార్గంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట–సికింద్రాబాద్ డీఈఎంయూ (రైలు నెం. 77654)ను జెండా ఊపి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
కార్యక్రమానికి ముందు కార్గిల్ అమరవీరులకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాధవనేని రఘునందన్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, సి. అంజి రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. మల్లన్న దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రజలకు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవుతుందన్నారు. కొమురవెల్లి స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర ప్రయాణికుల సౌకర్యాలు కల్పించాలని రైల్వే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి మల్లన్న ఆలయం వరకు షటిల్ బస్సు సేవలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అధికారులకు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.
తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం, కాచిగూడ, కాజీపేట, వరంగల్ తదితర స్టేషన్ల పునరాభివృద్ధి, కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, మూడో లైన్ పనులు, ఐదు వందే భారత్, ఆరు అమృత్ భారత్ రైళ్ల ప్రవేశం, మూడు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల మంజూరుతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని వివరించారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.5,454 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని, ఇది 2014–15తో పోలిస్తే దాదాపు 20 రెట్లు అధికమని తెలిపారు. రీజినల్ రింగ్ రైల్, హైస్పీడ్ రైల్, కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, మూడో లైన్ ప్రాజెక్టులు రాష్ట్రంలో రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. కొమురవెల్లి స్టేషన్ ప్రారంభం ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కొత్త స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశామని తెలిపారు. వెయిటింగ్ హాల్, ప్లాట్‌ఫాం షెల్టర్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, భక్తులు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Telangana
మల్లన్న భక్తులకు రైలు వరం! కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ డీఈఎంయూ ప్రారంభించిన కిషన్ రెడ్డి
Quick Summary:
ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి రైల్వే అనుసంధానం

