Telangana
*నందిమేడారంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం* • *రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు* • *పాఠశాల, అంగన్‌వాడీ భద్రతకు రూ.8 లక్షలు* - *సర్పంచ్ మ్యాడారం వీర్‌పాల్*
Quick Summary:
- *సర్పంచ్ మ్యాడారం వీర్‌పాల్*
నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద రూ.23 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించినట్లు సర్పంచ్ మ్యాడారం వీర్‌పాల్ తెలిపారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా గంగపుత్ర కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించగా, ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రానికి రూ.8 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీర్‌పాల్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే గ్రామపంచాయతీ లక్ష్యమని అన్నారు. గ్రామంలో దశలవారీగా పలు అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు కృషి చేస్తామని, గ్రామాభివృద్ధిలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ నిధులు మంజూరు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు సర్పంచ్ వీర్‌పాల్‌తో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవికుమార్, వార్డు సభ్యులు ఎల్తూరి లచ్చయ్య, గోళ్ల సంతోష్, కొండ సత్యనారాయణ, లింగాల తిరుపతి, కన్నా లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.
