నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
..........................................
జగిత్యాల పట్టణంలోని పాత బస్ స్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 డయాలసిస్ బెడ్లను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ*
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తర తెలంగాణలోనే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ప్రధాన వైద్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుండటం ఆనందంగా ఉందన్నారు. ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ బ్లాక్‌లలో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోందని, వాటి నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. జగిత్యాలతో పాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాలు, గోదావరి అవతలి ప్రాంతాల నుంచి వచ్చే రోగుల్లో గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఇక్కడే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా సింగిల్ యూజ్ (డిస్పోజబుల్) విధానంలో డయాలసిస్ సేవలు అందించడంతో పాటు, ఎరిత్రోపాయిటిన్, ఐరన్ కరెక్షన్ వంటి చికిత్సలను కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. హెచ్ఐవి/ఎయిడ్స్‌తో బాధపడుతున్న డయాలసిస్ రోగుల కోసం ప్రత్యేక బెడ్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు.
మెడికల్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ సుభాష్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. తాను కూడా వైద్యుడినే కావడంతో ఆసుపత్రి అవసరాలను వెంటనే గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిమ్స్ నెఫ్రాలజీ విభాగం సహకారంతో రోగులకు అవసరమైన ఫిస్టులా శస్త్రచికిత్సలు నిర్వహించి తిరిగి జగిత్యాలకు పంపుతున్నారని తెలిపారు.జగిత్యాల మెడికల్ కాలేజీ అభివృద్ధిలో నిమ్స్‌కు చెందిన డాక్టర్ గంగాధర్ విశేష కృషి చేశారని, ప్రస్తుతం ఒకే క్యాంపస్‌లో 730 పడకల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య సేవలు అందించే స్థాయికి ఆసుపత్రి చేరుకుందని అన్నారు. గతంలో జగిత్యాల మెడికల్ కాలేజీకి 334 మంది వైద్యులు, 368 మంది స్టాఫ్ నర్సుల పోస్టులు మంజూరు కావడం వల్ల వైద్య సేవలు మరింత బలోపేతమయ్యాయని గుర్తు చేశారు.ఉత్తర తెలంగాణకే జగిత్యాల ఒక ప్రధాన మెడికల్ హబ్‌గా ఎదుగుతోందని, నూతనంగా ప్రారంభించిన ఈ 10 డయాలసిస్ బెడ్ల ద్వారా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
*ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ*
జగిత్యాల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు జగిత్యాలను ఉత్తర తెలంగాణలో ప్రధాన మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్న శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన 10 డయాలసిస్ బెడ్లు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి రోగులకు ఎంతో ఊరటనిస్తాయని పేర్కొంటూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న నాణ్యమైన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ డిపార్ట్మెంట్ HOD డా. సుభాష్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఏవో వేణు,RMO నరేష్, విజయ్ రెడ్డి, కౌన్సిలర్స్ పిట్ట ధర్మరాజు, కూతురు శేఖర్, బొలుసాని శ్రీనివాస్, కోరే జయ గంగమల్లు, జంబర్తి గంగలక్ష్మి రాజ్ కుమార్, ప్రశాంత్ రావు, HDC టీవీ సూర్యం, మాజీ చైర్మెన్ గిరి నాగ భూషణం, నాయకులు రేపల్లె హరికృష్ణ, చందా పృథ్వీ, మెడికల్ సిబ్బంది, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Telangana
*జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 10 డయాలసిస్ బెడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్* -------------------------------------------
Quick Summary:
ఆసుపత్రిలో 10 డయాలసిస్ బెడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్,
