Telangana
*రైతుల దాహానికి నంది రిజర్వాయర్ సాక్ష్యం* * మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం * కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ * రిజర్వాయర్‌లో కబడ్డీ, క్రికెట్‌తో వినూత్న నిరసన
Quick Summary:
* రిజర్వాయర్‌లో కబడ్డీ, క్రికెట్‌తో వినూత్న నిరసన
*నేటి సాక్షి, ధర్మారం:* రైతుల దాహానికి, సాగునీటి ఎద్దడికి పెద్దపల్లి జిల్లాలోని నంది రిజర్వాయర్ (నంది మేడారం) ప్రస్తుత పరిస్థితి ఒక నిదర్శనంగా నిలిచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్‌లో నీటి మట్టం అత్యల్ప స్థాయికి పడిపోవడాన్ని నిరసిస్తూ ఆయన సోమవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రిజర్వాయర్‌ను పరిశీలించారు. నీరు పూర్తిగా ఎండిపోవడంతో రిజర్వాయర్‌లోనే కబడ్డీ, క్రికెట్ ఆడి ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు, తాగునీరు అందించారని అన్నారు. వేలాది చెక్‌డ్యామ్‌లు, ఎక్స్‌టెన్షన్ కెనాల్స్, చెరువుల పూడికతీత పనులు చేపట్టడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించారని గుర్తు చేశారు. ఎల్‌నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అనేక రిజర్వాయర్లను నిర్మించారని పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలనే ఉద్దేశంతో తాను మంత్రిగా ఉన్న సమయంలో అనేక సాగునీటి ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. రూ.16 కోట్లతో మ్యాదరి గండి ప్రాజెక్టు, బొమ్మరెడ్డిపల్లి–కొత్తపల్లి ఎక్స్‌టెన్షన్ కెనాల్, దొంగతుర్తి చెరువు లింక్, ఖానంపల్లి భీమన్న చెరువు అభివృద్ధి పనులకు ఆమోదం లభించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకెళ్లడం లేదని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద తగిన నీటి మట్టం ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. రోజుకు లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నా, రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కేటీఆర్, హరీష్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు, రైతులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. వర్షాలు లేక రైతులు అయోమయంలో ఉన్నారని, నారు పోయాలా వద్దా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ధర్మపురి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే వరుణ హోమాలు చేయడం కంటే కన్నెపల్లి పంప్ హౌస్ పంపులను వెంటనే ప్రారంభించి రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే పంపులను ప్రారంభించి కరువు పరిస్థితులను ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నాయకులు గుర్రం మోహన్ రెడ్డి, పుస్కూరి రామారావు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, దేవి నళిని కాంత్, దేవి వంశీ కృష్ణ, మహ్మద్ రఫీ, మిట్ట తిరుపతి, మిట్ట భారత్, నేరెళ్ళ చిన్న లచ్చయ్య, మహిళా నేతలు ఆవుల లత, కాంపెల్లి అపర్ణ, మార్క సంధ్య, మమత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
