నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు వికారాబాద్ డిఎస్‌పి అంజయ్య ఆద్వర్యం లో విశ్వసనీయ సమాచారం ఆధారంగా సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి వద్ద భారీ మొత్తంలో గంజాయి ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు రామ్ హరి (43), తండ్రి కంగలి, పాశి గ్రామం, గంజాం జిల్లా, ఒడిశా రాష్ట్రం, కలాబాబు ఖాన్ (33), తండ్రి తాల్బు ఖాన్, కొలకిరి గోపాలపూర్, జత్‌పూర్, ఒడిశా రాష్ట్రం గా గుర్తించారు. కలాబాబు ఖాన్ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తుండగా, రామ్ హరి కూడా ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసుల విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ రైల్వే స్టేషన్‌లో పరిచయమైన వీరిద్దరూ ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చుకోవాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. గంజాం జిల్లాకు చెందిన సునీల్ పాండీ అనే వ్యక్తి ఒడిశా నుంచి హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తూ పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్నాడని తెలుసుకుని అతనితో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అతని నుంచి గంజాయి తీసుకుని, విక్రయాల ద్వారా వచ్చే లాభాల్లో 40 శాతం తమకు వాటాగా తీసుకుంటూ, అతను సూచించిన ప్రాంతాల్లో నిర్ణయించిన వ్యక్తులకు గంజాయిని అందజేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు వారు అంగీకరించారు.
సునీల్ పాండీ ఆదేశాల మేరకు నిందితులు ఒడిశాలోని బెర్హంపూర్ రైల్వే స్టేషన్ నుంచి రైలులో సికింద్రాబాద్‌కు చేరుకుని, అక్కడి నుంచి మరో రైలులో వికారాబాద్‌కు వచ్చారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్లాట్‌ఫారం పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో వేచి ఉండగా, ముందస్తు సమాచారంతో నిఘా పెట్టిన పోలీసు బృందం వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ నిర్వహించింది.
తనిఖీలలో కలాబాబు ఖాన్ వద్ద 9 కిలోల గంజాయి, రామ్ హరి వద్ద 21 కిలోల గంజాయి లభ్యమవగా, మొత్తం 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేసి, NDPS చట్టాల ప్రకారం వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మాదకద్రవ్యాల సరఫరా వెనుక ఉన్న ప్రధాన నిందితుడు, ఇతర నెట్‌వర్క్ సభ్యులు, గంజాయిని స్వీకరించాల్సిన వ్యక్తుల వివరాలను సేకరించే దిశగా దర్యాప్తును పోలీసులు విస్తరించారు.
ఈ సందర్భంగా వికారాబాద్ డిఎస్‌పి అంజయ్య మాట్లాడుతూ, "మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై వికారాబాద్ జిల్లా పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగిస్తారు. రాష్ట్రాల మధ్య మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. గంజాయి విక్రయాలు, నిల్వలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని" కోరారు.
ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్, ప్రత్యేక పోలీసు బృందంలోని అధికారులు, సిబ్బందిని వికారాబాద్ ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,ఐపిఎస్ అభినందించడం జరిగింది. అని వికారాబాద్ డిఎస్‌పి అంజయ్య లో తెలియజేయడం జరిగింది.
Telangana
వికారాబాద్ రైల్వే స్టేషన్లో 30 కేజీల గంజాయి స్వాధీనం.
Quick Summary:
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,