Telangana
*గాలివాన బీభత్సానికి చిద్రమైన గ్రామాలు* * ఎగిరిన రేకులు.. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు * రహదారులపై చెట్లు.. రవాణాకు అంతరాయం * చర్లపల్లిలో భారీ ఆస్తి నష్టం.. ఆదుకోవాలని విజ్ఞప్తి
Quick Summary:
గాలివాన బీభాత్సనికి....
*నేటి సాక్షి, ఎండపల్లి:* ఉమ్మడి వెల్గటూర్ మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోగా, భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో వైర్లు తెగిపోయి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇకా జగిత్యాల–ధర్మారం ప్రధాన రహదారిపై పలు చోట్ల చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో గాలివాన తీవ్ర ప్రభావం చూపింది. గ్రామానికి చెందిన ఇరుకుల్ల విక్రమ్ దుకాణ సముదాయం పైకప్పు రేకులు పూర్తిగా ఎగిరిపడి రోడ్డుకు అవతల పడిపోయాయి. దీంతో ఆ దుకాణంలో అద్దెకు ఉన్న ఎరువులు, పురుగుమందుల దుకాణంలోని వ్యవసాయ సామగ్రి వర్షానికి తడిసిపోగా, వెల్డింగ్ షాపు నిర్వాహకుడి ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. విద్యుత్ పరికరాలు కూడా నీటిలో తడవడంతో యజమానితో పాటు నిర్వాహకులకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. అదే గ్రామానికి చెందిన సంకటి మల్లయ్యకు చెందిన గొర్రెల షెడ్ పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోగా, షెడ్ గోడలు కూలిపోయాయి. అలాగే మ్యాకల మల్లన్న, అదే వెంకన్న ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన రేకుల పందిర్లు గాలికి ఎగిరి దూరంగా పడిపోయాయి. గాలివానతో గ్రామంలోని పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. గుల్లకోట, కొండాపూర్‌తో పాటు ఇతర గ్రామాల్లోనూ రేకుల ఇండ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. ఇళ్లలోని గృహోపకరణాలు, ధాన్యం, ఇతర వస్తువులు వర్షానికి తడిసి ఆర్థిక నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో గ్రామీణ రహదారులపై రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో కొన్ని గ్రామాలు గంటల తరబడి చీకటిలోనే గడపాల్సి వచ్చింది. గాలివాన బీభత్సంతో తమ నివాస గూళ్లు దెబ్బతిని ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే నష్టం అంచనా వేసి ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మృగశిర కార్తె ఆరంభం అనంతరం కురిసిన తొలి వర్షం ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఈదురు గాలుల ఉద్ధృతి పలువురి జీవితాల్లో విషాదాన్ని నింపింది. గాలివాన బీభత్సంతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి విలయంతో ఏర్పడిన పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారు.