నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని నేతాజీ కూరగాయల మార్కెట్ ప్రధాన ద్వారం ముందు కొందరు కిరాణా దుకాణాల యజమానులు వ్యవహరిస్తున్న తీరు రైతులు, వినియోగదారులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల నుంచి కూరగాయలు విక్రయించేందుకు వచ్చే రైతులు, మార్కెట్‌కు వచ్చిన వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలను కొద్దిసేపు నిలిపినా, కొందరు కిరాణా దుకాణాల యజమానులు అది తమ సొంత స్థలమనే విధంగా వ్యవహరిస్తూ వాహనాలను వెంటనే తొలగించాలని ఆగ్రహంగా హెచ్చరిస్తున్నారని, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలతో వాగ్వాదాలకు దిగడం, అనుచితంగా మాట్లాడడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని పలువురు తెలిపారు.
మార్కెట్‌కు వచ్చే రైతులు, కొనుగోలుదారులకు తాత్కాలిక పార్కింగ్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో మార్కెట్‌కు వచ్చే వారిలో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొంటున్నారు.
ప్రభుత్వ రహదారులు, ప్రజా ప్రదేశాలను ఎవరూ తమ వ్యక్తిగత ఆస్తిలా భావించి, ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ పరిసరాల్లో పార్కింగ్‌కు సంబంధించి స్పష్టమైన ఏర్పాట్లు చేసి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు.
ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత శాఖలు వెంటనే స్పందించి మార్కెట్ పరిసరాల్లో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, వ్యాపారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Telangana
కూరగాయల మార్కెట్ ముందు కిరాణా షాపుల దౌర్జన్యం..! -రైతులు, వినియోగదారులు, వాహనదారులకు ఇబ్బందులు –అధికారుల జోక్యం కోరుతున్న ప్రజలు
Quick Summary:
అధికారుల జోక్యం కోరుతున్న ప్రజలు