నేటి సాక్షి, పరిగి.
(సురేష్ మోత్కూర్ )
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం తొలి విడత కింద రూ.2,482.02 కోట్ల నిధులను విడుదల చేసి, 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అలాగే రానున్న తొమ్మిది రోజుల్లో రైతు భరోసా కింద మొత్తం రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డా. టి. రామ్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతు భరోసా మొత్తాన్ని ఎకరానికి రూ.12 వేలకు పెంచి రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టామని తెలిపారు.రైతు రుణమాఫీ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొంటూ, కేవలం ఆరు నెలల్లోనే రూ.22,600 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసి రైతుల ఖాతాల్లో జమ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పు చేసిందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం స్వీకరించిందన్నారు.ఎన్నికలకు ముందు రాష్ట్రంపై రూ.6 లక్షల కోట్ల అప్పు ఉందని భావించామని, అధికారంలోకి వచ్చిన తర్వాత తవ్విన కొద్దీ గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయని తెలిపారు. అయినప్పటికీ ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్, ధాన్యం కొనుగోలు వంటి పథకాల ద్వారా రైతులకు ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తోందన్నారు. వ్యవసాయ రంగ బలోపేతానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు చేయాలని, అధిక డిమాండ్ ఉన్న సన్న వడ్ల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఉపాధి అవకాశాల కల్పన, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ వేగవంతంగా కొనసాగుతోందని, ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం రైతులది, పేదలది, మహిళలది, యువతది అని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో ప్రభుత్వం ఎప్పటికీ వెనుకడుగు వేయదని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. వారితో పాటు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డా. టి. రామ్మోహన్ రెడ్డి గారు హాజరై రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
Telangana
•రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి •హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డా. టి. రామ్మోహన్ రెడ్డి.
Quick Summary:
రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు
