నేటి సాక్షి గజ్వేల్ : ---
కల్లుగీత కార్మికుల న్యాయమైన హక్కుల సాధన, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కల్లుగీత కార్మిక సంఘం–తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గీతన్నల చైతన్య యాత్ర’ మంగళవారం గజ్వేల్ పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని గీత కార్మికులు, గౌడ బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యాత్రకు ఘన స్వాగతం పలికారు. ‘అమరుల యాదిలో..’ సాగుతున్న యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై గీత కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
గీత కార్మికుల సంక్షేమం, ఆత్మగౌరవానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేస్తున్న గీత కార్మికుల న్యాయమైన పోరాటాలకు, హక్కుల సాధనకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు ఆరోపించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గీత కార్మికులకు ప్రస్తుతం అందుతున్న పింఛన్‌ను జనాభా నిష్పత్తి ప్రకారం పెంచి నెలకు రూ.4 వేలుగా చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. వృత్తిలో భాగంగా తాటి చెట్టుపై నుంచి పడి మరణించిన లేదా శాశ్వత వికలాంగులైన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా తక్షణమే అందించాలని కోరారు. చెట్లు ఎక్కే కార్మికులకు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా ఆధునిక సేఫ్టీ కిట్లు అందించాలని డిమాండ్ చేశారు.
సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈ నెల 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్ఠించాలని కోరారు. గౌడ కార్మికులకు కేటాయించిన విధంగానే గీత కార్మికులకు కూడా వైన్‌షాపుల కేటాయింపులో 20 శాతం రిజర్వేషన్ కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.
ఆగస్టు 2న మోత్కూరులో ప్రారంభమైన ‘గీతన్నల చైతన్య యాత్ర’ ఈ నెల 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ముగియనుంది. ముగింపు సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేసి గీత కార్మికుల ఐక్యతను చాటాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వెంకట మల్లయ్య, వెంకన్న, గోపి, కర్ణాకర్, బండకింది అరుణ్, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ గౌడ సంఘం అధ్యక్షుడు కనుక గౌడ్, యాద గౌడ్, భాస్కర్‌గౌడ్, ఎర్రవల్లి యాదగౌడ్, రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గౌడ సంఘాల నాయకులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Telangana
గీతన్నల గర్జన.. సర్కారుకు హెచ్చరిక!
Quick Summary:
కల్లుగీత కార్మికుల న్యాయమైన హక్కుల సాధన

