నేటి సాక్షి గజ్వేల్: ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, వాహనదారుల ఇబ్బందులు... ఇవన్నీ మనుషులకే తప్ప పశువులకు వర్తించవన్నట్లుగా గజ్వేల్ పట్టణంలోని కొన్ని ప్రధాన రహదారులు కనిపిస్తున్నాయి. రహదారిపైనే హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న పశువులు, వాటిని తప్పించుకుని అష్టకష్టాలు పడుతూ ప్రయాణిస్తున్న వాహనదారులు నిత్య దృశ్యంగా మారిపోయింది.
ఉదయం స్కూల్ బస్సులైనా, అత్యవసరంగా వెళ్లే ద్విచక్ర వాహనాలైనా, నాలుగు చక్రాల వాహనాలైనా... ముందుగా "రోడ్డు రాజులకు" సెల్యూట్ చేసి, తర్వాతే దారి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. "ముందు మా విశ్రాంతి... తర్వాత మీ ప్రయాణం" అన్నట్టుగా రహదారినే పడకగదిగా మార్చుకున్న పశువులు ట్రాఫిక్‌కు బ్రేకులు వేస్తుంటే, అధికారులు మాత్రం కళ్లు మూసుకుని "అన్నీ సవ్యంగానే ఉన్నాయి" అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో గంటల తరబడి రోడ్డుపైనే పశువులు గుంపులుగా ఉండటంతో వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. స్కూల్ బస్సుల్లోని చిన్నారులు, ఉద్యోగులు, అత్యవసర పనులతో వెళ్లే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు.
"రోడ్డు ప్రభుత్వానిది... రాజ్యం పశువులది... పర్యవేక్షణ అధికారులది... ఇబ్బందులు ప్రజలవి" అన్న వ్యాఖ్యలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగాక స్పందించే బదులు, ముందస్తుగా చర్యలు తీసుకుని రహదారులపై సంచరిస్తున్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, గజ్వేల్ రహదారులను వాహనాల కోసమా... లేక పశువుల విశ్రాంతి కేంద్రాల కోసమా అన్న సందేహానికి తెరదించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Telangana
"ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఒకేలా వర్తించవు బ్రదర్... ఇక్కడ మేమే రాజులం!" "స్కూల్ బస్సులకైనా, బైకులకైనా నో ఎంట్రీ... మా విశ్రాంతికి ఏదీ సాటి రాదు!" రోడ్డు మాది... ట్రాఫిక్ మీ ఇష్టం! గజ్వేల్‌లో రహదారులపై పశువుల రాజ్యం.. చూస్తూ ఊరుకుంటున్న అధికారులు
Quick Summary:
రోడ్డు మాది... ట్రాఫిక్ మీ ఇష్టం!

