నేటి సాక్షిశంకర్‌పల్లి ప్రతినిధి:( సుధాకర్ గౌడ్ )
శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ 4వ వార్డులో నెలకొన్న రోడ్ల దుస్థితి, వర్షపు నీరు నిల్వ ఉండడం, దోమలు, ఈగల బెడదపై అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ మద్దూరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంతో మున్సిపల్ అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. వర్షం పడిన ప్రతిసారి రోడ్లు చెరువులను తలపిస్తున్నప్పటికీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
బుల్కాపూర్ 4వ వార్డులో రోడ్లన్నీ బురదమయంగా మారి, భారీ గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని శేఖర్ మద్దూరి తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండగా, చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులతో రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే మున్సిపాలిటీ కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
రోడ్లపై నిలిచిన మురికి నీటి కారణంగా దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఏర్పడిందని ఆయన హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఫాగింగ్, దోమల మందు పిచికారీ వంటి నివారణ చర్యలను నిర్లక్ష్యం చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
అభివృద్ధి పేరుతో ప్రకటనలు చేసుకోవడం కాదు, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడమే ప్రజాప్రతినిధులు, అధికారుల అసలు బాధ్యత అని శేఖర్ మద్దూరి స్పష్టం చేశారు. ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతున్నా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం అధికారుల వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ప్రజల సమస్యలను విస్మరించడం తగదని, ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
బుల్కాపూర్ 4వ వార్డులోని రోడ్లను అత్యవసరంగా మరమ్మతులు చేసి, వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వారానికి ఒకసారి ఫాగింగ్, దోమల మందు పిచికారీ నిర్వహించాలని అడ్వకేట్, బీఆర్ఎస్ నాయకులు శేఖర్ మద్దూరి డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
Telangana
బుల్కాపూర్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు
Quick Summary:
శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్
