నేటి సాక్షి గజ్వేల్:
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించి, మున్సిపల్ అనుమతులు లేకుండా చేపట్టినట్లు అధికారులు పేర్కొన్న నిర్మాణాలను జాలిగామ బైపాస్ ప్రాంతంలో గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. కూల్చివేతల సందర్భంగా నిర్మాణదారులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి అక్రమ నిర్మాణదారులకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. మున్సిపల్ అనుమతులు లేకుండా ఒక్క ఇటుక వేసినా ఉపేక్షించేది లేదని, వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించే వారిపై ఎలాంటి కనికరం చూపబోమని స్పష్టం చేశారు.
చట్టాన్ని ధిక్కరించి నిర్మాణాలు కొనసాగిస్తే ముందస్తు నోటీసులు, హెచ్చరికల కోసం వేచి ఉండబోమని, నేరుగా కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా సంబంధిత ఆస్తులను జప్తు చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాజకీయ అండలు, సిఫార్సులు, ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గే ప్రసక్తే లేదని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజా భూములను కబ్జా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, మున్సిపల్ పరిధిలో అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణానికీ అవకాశం ఉండదని తేల్చిచెప్పారు.
అయితే కూల్చివేతలకు గురైన వారు మాత్రం గతంలో జరిగిన అనేక అక్రమ నిర్మాణాలను అధికారులు పట్టించుకోలేదని, ఇప్పుడు సామాన్యులపైనే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. చట్టాన్ని అందరికీ ఒకేలా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మున్సిపల్ అధికారులు ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ, నిర్మాణాలు చేపట్టే ముందు తప్పనిసరిగా మున్సిపల్ అనుమతులు పొందాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కూల్చివేతలతో పాటు క్రిమినల్ కేసులు, ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
Telangana
అక్రమ కట్టడాలకు మున్సిపల్ ఉక్కుపాదం అనుమతి లేని నిర్మాణాలైతే నేలమట్టమే..! వక్ఫ్ భూముల ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తాం – కమిషనర్ గణేష్ రెడ్డి హెచ్చరికలు కాదు... ఇక నేరుగా కూల్చివేతలే, క్రిమినల్ కేసులూ తప్పవు
Quick Summary:
హెచ్చరికలు కాదు... ఇక నేరుగా కూల్చివేతలే, క్రిమినల్ కేసులూ తప్పవు

