*నేటిసాక్షి - వికారాబాద్ జిల్లా / నవాబ్‌పేట్, జూలై 11:*
వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలంలో వాన దేవుడు కన్ను తెరుస్తాడని.. ఆకాశం వైపు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే మిగులుతోంది. వర్షాకాలం వచ్చి నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ముసురు పడకపోవడంతో మండలవ్యాప్తంగా రైతాంగం గుండెలు తరుక్కుపోతున్నాయి. ‘ఈ ఏడాది వర్షాలు బాగుంటాయి’ అన్న ఆశతో అప్పులు సప్పులు చేసి విత్తనాలు వేసిన రైతన్నలకు ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది.
*మొలక దశలోనే మాడిపోతున్న పంటలు..*
సకాలంలో వర్షాలు లేక మండలంలో సాగు చేసిన పత్తి, మక్కజొన్న, వేరుశనగ పంటలు మొలక దశలోనే నిలువునా ఎండిపోతున్నాయి. అక్కడక్కడా పడిన అరకొర జల్లులకు విత్తనాలు వేసినా, ఆ తర్వాత ఎండల తీవ్రత పెరగడంతో భూములు నెర్రలు వారుతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో బోర్ల కింద కూడా తడులు అందించే పరిస్థితి లేక చేన్లు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
"వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు వేశాం. వానలు లేక మొలకలు మాడి బూడిదవుతున్నాయి. మళ్లీ విత్తనాలు వేయాలన్నా చేతిలో పైసా లేదు.. అప్పు ఇచ్చే నాథుడూ లేడు" అంటూ మండల పరిధిలోని రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
*అప్పుల ఊబిలో అన్నదాత.. ఆదుకోవాలంటున్న రైతు లోకం!*
దుక్కులు, విత్తనాలు, ఎరువుల కోసం ఎకరాకు వేల రూపాయలు ఖర్చు చేసిన పెట్టుబడి పూర్తిగా వృథా కావడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది సంసారం ఎలా గడవాలి, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, నవాబ్‌పేట్ మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను అంచనా వేసి, ప్రత్యామ్నాయ పంటల కోసం ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలని, నష్టపోయిన ప్రతి ఎకరానికి తక్షణ పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని రైతు సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- *న్యూస్ రిపోర్టర్: మొహమ్మద్ గౌస్ పాషా, నవాబ్‌పేట్*
Telangana
*చేతికందక ముందే మాడిపోతున్న పంటలు.. నవాబ్‌పేట్ అన్నదాతల గుండెల్లో గుబులు!* *ఆకాశం వైపు దీనంగా అన్నదాతల చూపు.. ఎండిపోతున్న పంటలతో కన్నీరు!*
Quick Summary:
అన్నదాతల గుండెల్లో గుబులు!