నేటి సాక్షి గజ్వేల్: -----
గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ప్రజా పాలన ద్వారా మాత్రమే పేదల అభివృద్ధి సాధ్యమవుతుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శనివారం మల్లారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరితో కలిసి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా గజ్వేల్‌కు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా పాఠశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తూ, నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని, రెండు విడతల్లో గజ్వేల్‌కు మొత్తం 6 వేల ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొంటూ, రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.12 వేల చొప్పున జమ చేయడంతో పాటు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రత్యేక యాప్ ద్వారా ఎరువుల పంపిణీ జరుగుతోందని, సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అదనంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు కొనసాగుతున్నాయని, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని నర్సారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు చెన్నయ్య, గోరెమియా, గోపాల్ రెడ్డి, కుమార్, మహేందర్ గౌడ్, అంజిరెడ్డి, పొన్నాల నర్సారెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Telangana
గజ్వేల్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి నియోజకవర్గానికి 6 వేల ఇందిరమ్మ ఇళ్లు.. రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసిన ప్రభుత్వం మల్లారెడ్డిపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
Quick Summary:
నియోజకవర్గానికి 6 వేల ఇందిరమ్మ ఇళ్లు.. రూ.25 కోట్లతో