నల్లగొండ, నేటిసాక్షి :
తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. అది కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవం, అనేకమంది అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న చారిత్రక స్వప్నం. తెలంగాణ ఉద్యమ సమయంలో "సామాజిక తెలంగాణ" నిర్మిస్తామని, ప్రతి పేద కుటుంబానికి విద్య, ఉద్యోగం, గొప్ప జీవనం అందిస్తామని హామీలు ఇచ్చారు. "కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య" అనే నినాదం ప్రజల్లో అపారమైన ఆశలు నింపింది. కానీ తెలంగాణ ఏర్పడిన పన్నెండు సంవత్సరాల తరువాత వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే, ప్రజలు కలగన్న సామాజిక తెలంగాణ స్థానంలో ప్రైవేటీకరణ ఆధారిత తెలంగాణ రూపుదిద్దుకుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా విద్యారంగంలో ప్రభుత్వ బాధ్యత క్రమంగా తగ్గిపోతూ, ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరుగుతోంది. ఫలితంగా విద్య ఒక హక్కు కాకుండా కొనుగోలు చేయాల్సిన వస్తువుగా మారిపోయింది.
2014-15లో తెలంగాణలో మొత్తం 43,839 పాఠశాలలు ఉండగా, వాటిలో 65.74% ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2026 నాటికి ప్రభుత్వ పాఠశాలల వాటా తగ్గిపోయింది. 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో 2014-15లో 46.49% మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉండగా, ప్రస్తుతం అది 28%కు పడిపోయింది. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం తగ్గుతున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వాలు రెసిడెన్షియల్ పాఠశాలల పెరుగుదలను తమ విజయంగా చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్రంలోని మొత్తం విద్యార్థులతో పోలిస్తే అది పరిమిత వర్గానికే ప్రయోజనం కలిగించింది. మిగతా లక్షలాది మంది విద్యార్థులు మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల భారాన్ని మోస్తూనే ఉన్నారు.
ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు లేదు?
ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించే సమగ్ర చట్టం తెలంగాణలో ఇప్పటికీ లేదు. మూడు దశాబ్దాలుగా ఫీజు నియంత్రణపై చర్చ జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు అమలులోకి వచ్చిన చట్టం లేదు. 2017లో తిరుపతిరావు కమిటీ, 2018లో క్యాబినెట్ సబ్ కమిటీ, 2025లో రాష్ట్ర విద్యా కమిషన్ నివేదికలు వచ్చినప్పటికీ, ఫీజు రెగ్యులేషన్ చట్టం మాత్రం అమలుకు నోచుకోలేదు. ఫలితంగా ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలు పిల్లల చదువుల కోసం అప్పుల పాలవుతున్నాయి.
విద్యా హక్కు చట్టం అమలు ఎందుకు లేదు?
విద్యా హక్కు చట్టం (RTE) 2009లోని సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలి. దేశంలోని 22 రాష్ట్రాలు ఈ నిబంధనను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఇప్పటికీ అమలు కావడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న చట్టం తెలంగాణలో ఎందుకు అమలుకావడం లేదు? పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే అవకాశాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
విద్యపై అత్యల్ప ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ,
2026-27 తెలంగాణ బడ్జెట్‌లో మొత్తం ₹3.24 లక్షల కోట్లలో విద్యకు కేవలం ₹26,674 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే కేవలం 8.2% మాత్రమే.
బీహార్ 19.63%, ఢిల్లీ 18.64%, మహారాష్ట్ర 13.7%, మధ్యప్రదేశ్ 13.7%, ఆంధ్రప్రదేశ్ 11.7%, కర్ణాటక 10.7% విద్యకు కేటాయిస్తున్నాయి. దేశ సగటు 14-15% మధ్య ఉంది. అయితే దేశంలోనే ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ విద్యకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం ఆందోళనకరం.
వేగంగా పెరుగుతున్న విద్య ప్రైవేటీకరణ
2018లో ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకురావడం ద్వారా తెలంగాణలో ప్రైవేటీకరణకు మరింత ఊతం లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 20 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండగా, ప్రభుత్వ యూనివర్సిటీలు కేవలం 19 మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. మరోవైపు ప్రభుత్వ యూనివర్సిటీల్లో వేలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అనేక యూనివర్సిటీల్లో రెగ్యులర్ అధ్యాపక నియామకాలు జరగలేదు. బిఎస్పీ పార్టీ నుండి తమ డిమాండ్లు విద్యకు బడ్జెట్ కేటాయింపులను కనీసం 15%కు పెంచాలి. ఫీజు రెగ్యులేషన్ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను పేద పిల్లలకు అమలు చేయాలి. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో సామాజిక న్యాయం, పారదర్శకతను నిర్ధారించే విధానాలు రూపొందించాలి.
విద్యపై ఖర్చు వృథా కాదు. అది సమాజ భవిష్యత్తుపై పెట్టుబడి. విద్యావంతమైన సమాజమే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడుతుంది. కానీ విద్యను వ్యాపారంగా మార్చి ప్రభుత్వ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే అసమానతలు మరింత పెరుగుతాయి. నీట్ పేపర్ లీకేజీ వంటి జాతీయ స్థాయి సమస్యలపై యువత స్పందించినట్లే, తెలంగాణలో జరుగుతున్న విద్యా దోపిడీపై కూడా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రజల ఒత్తిడి ద్వారానే విద్యా విధానాల్లో మార్పు సాధ్యమవుతుంది.
విద్యను కాపాడటం అంటే తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే అని
కత్తుల కాన్షీరామ్ అన్నారు.
Telangana
తెలంగాణలో విద్య హక్కు కాదు... ఒక పెద్ద దోపిడీ.... -బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి కత్తుల కాన్షీరామ్
Quick Summary:
తెలంగాణలో విద్య హక్కు కాదు...