నేటి సాక్షి,కోదాడ
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో తెలంగాణ రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. కోదాడ నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి కోదాడ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటల సాగు ప్రారంభమైన అత్యంత కీలక సమయంలో రైతులకు క్రాప్ లోన్లు అందకుండా ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని ఆరోపించారు. గతంలో రుణాల రెన్యూవల్ సులభంగా జరిగేదని, ఇప్పుడు మాత్రం బ్యాంకులు అసలు, వడ్డీతో సహా మొత్తం బకాయి చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామని రైతులను వేధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, సాగు ఖర్చుల పెరుగుదల, గిట్టుబాటు ధరల లేమితో నష్టాల్లో ఉన్న రైతులపై ఇది మరో పెను భారంగా మారిందన్నారు.
బ్యాంకులపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోవడంతో రైతులు మళ్లీ గ్రామాల్లోని ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకునే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతును అప్పుల ఊబిలోకి నెట్టేసి చేతులు దులుపుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తూ రైతులను నిద్రలేని రాత్రులకు గురిచేస్తోందని మండిపడ్డారు. అర్థరాత్రి వేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయడంతో రైతులు ప్రాణాలను పణంగా పెట్టి పొలాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తీవ్ర లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంలో కూడా విఫలమైందని విమర్శించారు.
మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువుల రవాణాకు ఇచ్చే FOL రాయితీని రద్దు చేయడం రైతులపై మరో దెబ్బ అని పేర్కొన్నారు. దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి, గ్రామీణ ప్రాంతాల్లో కొరత ఏర్పడి, బ్లాక్ మార్కెట్‌కు ప్రభుత్వం స్వయంగా మార్గం సుగమం చేస్తోందని ఆరోపించారు.
రైతు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రాప్ లోన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఎరువుల రాయితీలు, సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Telangana
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పాలన.. క్రాప్ లోన్లు నిలిపివేత.. విద్యుత్ కోతలు.. ఎరువుల రాయితీల రద్దుతో రైతాంగం విలవిల... రైతు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు.. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్... ఆర్డీవోకు భారీగా తరలివెళ్లి వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు...
Quick Summary:
రైతు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు..
