నేటి సాక్షి,మునగాల,
ఎన్నికల ముందు రైతాంగానికి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తున్నా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్ విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగాన్ని మాయమాటలతో మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, రూ.2 లక్షల వరకు పూర్తి రుణమాఫీ, వరితో పాటు అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా 100 శాతం రూ.2 లక్షల రుణమాఫీ జరగలేదని, రైతు భరోసా పేరుతో కేవలం చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిమితంగా నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలకు భరోసా కల్పించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమాను నిర్వీర్యం చేసి రైతాంగానికి అన్యాయం చేసిందన్నారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి రైతుల భూ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని, లక్షలాది సాదా బైనామా దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
కెసీఆర్ ప్రభుత్వం 29 రకాల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి కనీస మద్దతు ధర కల్పించగా, ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఏడు రకాల ధాన్యానికే పరిమితం చేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. యూరియా పంపిణీలో యాప్ విధానం తీసుకొచ్చి రైతులను ఎరువుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పుతోందని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెరగడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టే ఆలోచన రైతాంగానికి ప్రమాదకరమని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందించి అండగా నిలిచిందన్నారు. అలాగే కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, వెంటనే కాలేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ కాలువల ద్వారా సూర్యాపేట జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై పునరాలోచన చేసి రైతు భరోసా, రైతు బీమా, పంట బోనస్, భూభారతి, యూరియా యాప్ వంటి అంశాలపై శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో రైతాంగం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తొగరు రమేష్, మునగాల పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, తాడ్వాయి మాజీ పీఏసీఎస్ చైర్మన్ తొగరు సీతారాములు, పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ, ఇంద్రశేఖర్ రెడ్డి, నాగిరెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Telangana
రైతులను మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం.. 30 నెలలు గడిచినా హామీలు అమలు కాలేదు: బీఆర్ఎస్ నేత సుంకర అజయ్ కుమార్..
Quick Summary:
రైతులను మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం..