నేటి సాక్షి గజ్వేల్ : ----
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటిని ప్రశ్నించిన వారిపై అక్రమ అరెస్టులకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి తీవ్రస్థాయిలో విమర్శించారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన భూ పోరాట కార్యక్రమానికి హాజరైన ఉద్యమకారులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఉద్యమకారులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఉప్పల్ బాగాయత్‌లో నిర్వహించనున్న భూ పోరాట కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టు చేయడం ద్వారా హామీలు అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని స్పష్టమైందని అన్నారు.
అరెస్టులు ఉద్యమకారులకు కొత్తకాదని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నామని కొట్టాల యాదగిరి తెలిపారు. అక్రమ అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాలను అణచివేయలేరని, ఉద్యమకారుల హక్కులు సాధించే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన ప్రభుత్వం ఉద్యమకారులపై పోలీసు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. కవితతో పాటు ఉద్యమకారుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎడ్ల నర్సింలు, రాజు, స్వామి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Telangana
కవిత అరెస్టు హేయమైన చర్య.. ఉద్యమకారుల గొంతు నొక్కే కుట్ర: తెలంగాణ రక్షణ సేన హామీలు అమలు చేయలేక అరెస్టుల బాట.. కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డ కొట్టాల యాదగిరి
Quick Summary:
హామీలు అమలు చేయలేక అరెస్టుల బాట..
