నేటిసాక్షి, మిర్యాలగూడ : తిరుపతిలోని స్థానిక మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర నాట్యకళా పరిషత్తు 72వ వార్షిక జాతీయ స్థాయి పౌరాణిక నాటక పోటీల్లో మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం కళాకారులు ప్రదర్శించిన ‘రావణ’ పద్య నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న నాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఈ ప్రదర్శనలో కళాకారులు అద్భుతమైన పద్య పఠనం, హావభావాలు, సంభాషణలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముఖ్యంగా రావణాసురుడి పాత్రలో కళాకారులు ప్రదర్శించిన గాంభీర్యం, ఆహార్యం నాటక ప్రియులు, పండితుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది.
ప్రాచీన పద్య నాటక వైభవాన్ని ప్రతిబింబించేలా కళాకారులు ఆలపించిన పద్యాలకు సభికుల నుంచి ఈలలు, చప్పట్లతో అభినందనలు లభించాయి. పౌరాణిక వాతావరణాన్ని తలపించేలా రూపొందించిన రంగస్థల అలంకరణ, నేపథ్య సంగీతం నాటకానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం నటీనటులు తమ అనుభవజ్ఞతను చాటుకుంటూ ప్రతి పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు. కళాకారులకు ఘన సత్కారం
నాటక ప్రదర్శన అనంతరం శ్రీ వేంకటేశ్వర నాట్యకళా పరిషత్తు నిర్వాహకులు మిర్యాలగూడ కళాకారులను దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాట్యకళా పరిషత్తు ప్రతినిధులు, ప్రముఖ రంగస్థల నటులు, బాలల పౌరాణిక నాటికల విభాగం కళాకారులు, పెద్ద సంఖ్యలో నాటక ప్రియులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో
తడకమళ్ల రామచంద్రరావు, పుల్లాభట్ల లక్ష్మీనారాయణశర్మ, భుజంగరావు, కంబాల శ్రీనివాస్, రోశయ్య చౌదరి, సురభి వెంగమాంబ, రమలక్ష్మి, హారిక ఎల్లయ్య, సత్యం, ముస్తఫా, శివ, గుండు వెంకటేశ్వర్లు, దుర్గి శ్రీనివాస్, రామావతారం, లక్ష్మయ్య, శ్రీనివాస్ తదితరులు ‘రావణ’ పద్య నాటకంలో పాల్గొన్నారు.
Telangana
తిరుపతిలో అలరించిన ‘రావణ’ పద్య నాటకం -మిర్యాలగూడ కళాకారులకు ఘన సత్కారం
Quick Summary:
మిర్యాలగూడ కళాకారులకు ఘన సత్కారం
