*నేటి సాక్షి - కోరుట్ల*
---------------------
జగిత్యాల జిల్లాలో రైస్ మిల్లుల వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల మూడు రైస్ మిల్లుల్లో రూ.87.89 కోట్ల విలువైన ధాన్యం అక్రమాల వ్యవహారం వెలుగులోకి రావడంతో 'రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం' దృష్టి జగిత్యాల జిల్లాపై కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో మల్లాపూర్ మండలం మొగిలిపేటలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లుపై మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ తనిఖీలను అత్యంత గోప్యంగా నిర్వహించడం, అధికారుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
*20కి పైగా వాహనాల్లో విజిలెన్స్ బృందం*
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ పారాబాయిల్డ్ రైస్ మిల్ పై 'రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్' అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సుమారు 20కి పైగా వాహనాల్లో మిల్లుకు చేరుకుని పలువురు అధికారులతో కలిసి గంటల తరబడి తనిఖీలు చేపట్టింది. మిల్లులోని గోదాములు, ధాన్యం నిల్వలు, బియ్యం నిల్వలు, సంబంధిత రికార్డులు, కొనుగోలు వివరాలు, మిల్లింగ్‌కు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది.
*'సీఎంఆర్' లెక్కలపై నిశిత పరిశీలన*
తనిఖీల్లో భాగంగా గత కొన్ని సీజన్లుగా ప్రభుత్వ సంస్థల ద్వారా మిల్లుకు కేటాయించిన ధాన్యం, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ వివరాలను అధికారులు సరిపోల్చినట్లు సమాచారం. గోదాముల్లో ఉన్న భౌతిక ధాన్యపు బస్తాల (Physical Stocks)ను రికార్డులతో పోల్చి పరిశీలించడంతో పాటు ప్రభుత్వ ధాన్యం నిల్వలు, బియ్యం తరలింపుకు సంబంధించిన అంశాలపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది.
*87.89 కోట్ల అక్రమాల తర్వాత మరింత నిఘా*
ఇటీవల జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లి శివారులోని మూడు రైస్ మిల్లుల్లో సుమారు 34,388 మెట్రిక్ టన్నుల ధాన్యం గల్లంతైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి, దాదాపు రూ.87.89 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్లు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ పరిణామాల అనంతరం జిల్లాలోని ఇతర రైస్ మిల్లులపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన విజిలెన్స్ అధికారులు ఇప్పుడు మొగిలిపేట ఏఆర్ఎస్ మిల్లులో తనిఖీలు నిర్వహించడం రైస్ మిల్లర్లలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
*మీడియాకు వివరాలు ఇవ్వడంలో గోప్యత ఎందుకు.?*
ఈ స్థాయి తనిఖీలు జరుగుతున్నప్పటికీ మల్లాపూర్, జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మీడియా ప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హంగా మారింది. సాధారణంగా ఇలాంటి తనిఖీల అనంతరం ప్రాథమిక వివరాలు వెల్లడించే అధికారులు ఈసారి పూర్తిగా గోప్యత పాటించడం పలు సందేహాలకు తావిస్తోంది. తనిఖీల వివరాలు తెలుసుకునేందుకు జిల్లా పౌరసరఫరాల అధికారి (DSO) జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి (DPRO)లను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఫోన్ కాల్ లో స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
*నివేదిక కోసం ఎదురుచూపులు*
మొగిలిపేట ఏఆర్ఎస్ రైస్ మిల్లులో జరిగిన ఈ తనిఖీల్లో అధికారులు ఏవైనా అక్రమాలు గుర్తించారా.? లేక ఇది రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సాధారణ ధృవీకరణ ప్రక్రియలో భాగమేనా.? అనే అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. నిల్వల్లో, రికార్డుల్లో ఏవైనా వ్యత్యాసాలు తేలితే సంబంధిత మిల్లు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. విజిలెన్స్ శాఖ అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే ఈ సోదాల్లో వెలుగులోకి వచ్చిన అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.!
__________________________
Telangana
*మొగిలిపేట రైస్ మిల్లుపై విజిలెన్స్ 'మెరుపు' దాడులు.!* --------------------------- * 20కి పైగా వాహనాల్లో వచ్చిన ప్రత్యేక బృందం * 'ఏఆర్ఎస్ రైస్ మిల్లు'లో గంటల తరబడి తనిఖీలు * ధాన్యం నిల్వలు, రికార్డులు, సీఎంఆర్ లెక్కలపై నిశిత పరిశీలన.. * జగిత్యాల జిల్లా రైస్ మిల్లర్లలో కలకలం * మీడియాకు సమాచారం లేకుండా గోప్యంగా ఆపరేషన్.. అధికారిక వివరాలపై అనుమానాల వెల్లువ ------------------
Quick Summary:
జగిత్యాల జిల్లా రైస్ మిల్లర్లలో కలకలం

