Telangana
*పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి* * శానబండ సర్పంచ్ గాదం భాస్కర్ * నిధుల లేమితో గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన * పంచాయతీ నిధులే ప్రజా పాలనకు ఆధారం
Quick Summary:
* నిధుల లేమితో గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన
*ఎండపల్లి (నేటి సాక్షి):* రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు తక్షణమే ప్రత్యేక నిధులు విడుదల చేసి గ్రామాభివృద్ధికి చేయూతనివ్వాలని ఎండపల్లి మండలం శానబండ గ్రామ సర్పంచ్ గాదం భాస్కర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు అందకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరత కారణంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్వహణతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కూడా కష్టసాధ్యంగా మారిందన్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచులుగా గెలిచినప్పటికీ ఆర్థిక వనరుల లేమితో గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టలేక ప్రజల ముందు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసిన ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యంగా చిన్న గ్రామ పంచాయతీలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. రెండేళ్లపాటు ప్రత్యేక అధికారుల పాలన అనంతరం ఎన్నికైన సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కూడా గతంలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపులకే సరిపోవడంతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రజాపాలన గ్రామస్థాయిలో ఫలించాలంటే పంచాయతీలకు తగిన నిధులు అందించడం అత్యవసరమని స్పష్టం చేశారు. పంచాయతీ నిధులే ప్రజాపాలనకు ఆధారమని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం సమగ్రాభివృద్ధి సాధిస్తాయని అన్నారు. పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక నిధులు విడుదల చేయాలని గాదం భాస్కర్ కోరారు.