Telangana
*బలమైన భవిష్యత్‌కు తల్లిపాలే పునాది* * ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో సర్పంచ్ మల్లేష్ గౌడ్
Quick Summary:
* ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో సర్పంచ్ మల్లేష్ గౌడ్
*ఎండపల్లి (నేటి సాక్షి):* ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఎండపల్లి మండలం గుల్లకోట రైతువేదికలో సోమవారం బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టిన గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని, జననం నుంచి తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా శిశువుకు అవసరమైన సంపూర్ణ పోషకాహారం, రోగనిరోధక శక్తి లభిస్తుందని నిర్వాహకులు వివరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ తల్లిపాలే శిశువు ఆరోగ్యవంతమైన జీవితానికి తొలి పునాది అని అన్నారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలు అందించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లి–శిశు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుతో పాటు తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, కుటుంబ సభ్యులు బాలింతలకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రత పాటిస్తూ అంగన్‌వాడీ, వైద్య సిబ్బంది సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృపాకర్, సీడీపీవో వాణిశ్రీ, ఐసీడీఎస్ సూపర్వైజర్ అండాలు, గ్రామ కార్యదర్శి నవీన్, ఎంఎల్‌హెచ్‌పీ రక్షిత, వివిధ గ్రామాల అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.