నేటిసాక్షి, నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, పెండింగ్‌లో ఉన్న మ్యాపింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బీఎల్‌ఓలను ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్‌లోని 7, 10, 12 వార్డుల్లో బీఎల్‌ఓలు చేపడుతున్న సర్ ప్రక్రియ, ఓటర్ల మ్యాపింగ్ విధానాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న నమోదును పరిశీలిస్తూ, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక బిఎల్ఓ తో మాట్లాడుతూ "మీ వార్డులో మొత్తం ఎన్ని ఓటర్లు ఉన్నారు? ఎన్ని ఫారాలు జనరేట్ అయ్యాయి? ఎన్ని మ్యాపింగ్ చేశారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి?" అని ప్రశ్నించారు. దీనికి బీఎల్‌ఓ సమాధానంగా మొత్తం 961 ఓటర్లు ఉండగా, 593 మంది మ్యాపింగ్ పూర్తి చేశామని, మిగిలిన వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న ప్రతి ఓటరును గుర్తించి ఎలాంటి ఆలస్యం లేకుండా సర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.డోర్ లాక్ కారణంగా ఇంట్లో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి సంబంధించిన డోర్ నంబర్ నమోదు చేస్తూ ఓటర్ల మ్యాపింగ్ చేయాలని చెప్పారు.
అన్‌మ్యాపింగ్ అయిన ఓటర్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఉంటే నమోదు చేసి, సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒక్క ఓటు మాత్రమే ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మ్యాపింగ్ పూర్తయిన తర్వాత నమోదు వివరాలను సక్రమంగా రికార్డు చేయాలని తెలిపారు.
ఎవరైనా ఓటరు తమ ఈపిఐసి నంబర్ చెబితే వెంటనే ఆన్‌లైన్‌లో పరిశీలించి, ఓటరు వివరాలు నిర్ధారించవచ్చని కలెక్టర్ వివరించారు. 10వార్డులో ఒక ఓటరు తన ఎపిక్ కార్డు తీసుకొచ్చి కలెక్టర్ కు ఇవ్వగా, కలెక్టర్ వెంటనే ఎపిక్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేసి, తన ఓటు ఉందని చెప్పారు. మరణించిన వారి ఓట్లను తొలగించేందుకు మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
109 పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, అక్కడి బీఎల్‌ఓను వార్డులో మొత్తం ఓటర్లు, మ్యాపింగ్ పూర్తయిన వారి సంఖ్య, పెండింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివాహం అనంతరం కొత్త ప్రాంతంలో స్థిరపడిన మహిళలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇంకా గుర్తింపు కాని ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు.
అన్‌మ్యాపింగ్ జాబితాలో ఉన్న వారి వివరాలను కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేసి అవసరమైన సమాచారం సేకరించి సర్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ బీఎల్‌ఓలకు ఆదేశించారు. అర్హులైన వారు ఓటరు జాబితాలో ఉండేలా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సైదులు, తహసిల్దార్ ఖాసీం, మున్సిపల్ చైర్ పర్సన్ మానస స్వర్ణ సుమన్,
కౌన్సిలర్ వినిష, డిప్యూటీ తహసిల్దార్ శ్రీదేవి, ఆర్ ఐ సందీప్, అధికారులు, బిఎల్ఓ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Telangana
సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
Quick Summary:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర