నేటి సాక్షి వికారాబాద్:
ఖమ్మం జిల్లాలో ఓ మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటన పట్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మెడికల్ సెల్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తోందని రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ "డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి" తెలిపారు.
శుక్రవారం నాడు నిమ్స్ హాస్పిటల్ లో బాలికను రాష్ట్ర మెడికల్ సెల్ కో కన్వీనర్ డాక్టర్ రష్మీ కండ్లికర్, డాక్టర్ సుమన్ లతో కలిసి బాధితురాలిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఖమ్మం జిల్లా తల్లాంపాడు గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక వేసవి సెలవుల సందర్భంగా ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో నివసిస్తున్న తన తాతయ్య, అమ్మమ్మల ఇంటికి వెళ్లింది. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు అత్యంత కలచివేసే విషయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఘటన బయటపడుతుందనే భయంతో బాలికను భవనం పై అంతస్తు నుంచి కిందకు తోసివేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడిందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోందన్నారు. శరీరంలోని పలు అవయవాలకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు తెలిసిందని పేర్కొన్నారు.
ఈ దారుణ ఘటనను తెలంగాణ రాష్ట్ర బీజేపీ మెడికల్ సెల్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఇంతటి ఘోర నేరం జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, మహిళా సంక్షేమ శాఖ ప్రతినిధులు తక్షణ స్పందన చూపకపోవడం బాధాకరమన్నారు.
నిందితుడిపై నేర తీవ్రతకు అనుగుణంగా అన్ని సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధితురాలికి న్యాయం జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, పౌర సమాజ సంస్థలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రస్తుతం బాలికకు అత్యుత్తమ వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలని, చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. అలాగే బాధితురాలి కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రకటించడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి, బాలికకు సాధ్యమైనంత ఉత్తమ వైద్య చికిత్స అందించాలని కోరినట్లు తెలిపారు.ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించి బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాలని, నిందితుడికి అత్యంత కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Telangana
ఖమ్మం బాలికపై జరిగిన అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర మెడికల్ సెల్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి.
Quick Summary:
అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం...
