*నేటి సాక్షి - కోరుట్ల*
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం స్పష్టం చేశారు. సీపీఐ జాతీయ పిలుపు మేరకు గురువారం కోరుట్ల డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ప్రచార జాత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడిందన్నారు.
*హామీలు గాలికొదిలిన ప్రభుత్వం*
ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని, నోట్ల రద్దు సమయంలో విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిన మాటను కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని విమర్శించారు.
*కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు*
కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఎనిమిది గంటల పనిదినానికి బదులుగా 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు.బీడీ కార్మికులు, హమాలీలు, అంగన్‌వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఆశా వర్కర్లు, ఆర్‌పీలు, గ్రామపంచాయతీ కార్మికులకు ఇప్పటికీ చట్టబద్ధమైన కనీస వేతనాలు, బీమా వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు.
*ప్రజలను చైతన్యపరిచేందుకే ప్రచార జాత*
ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువతను ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యపరిచేందుకే ఈ ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నేతలు ఇరుగురాల భూమేశ్వర్, ఎట్టండి భూమయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సుతారి రాములు, ఎండీ ముక్తార్, ఎం.ఎం. రాధ, మునుగోరి హనుమంతు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకుడు ఎండీ ఉస్మాన్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రామిల్ల రాంబాబు, శ్రీగాధ దేవదాస్, ప్రజానాట్యమండలి జిల్లా నాయకుడు చిట్యాల లక్ష్మీరాజం, పిట్టల నారాయణ, సీపీఐ నేతలు అందే వంశీకృష్ణ, ఎండీ సమీర్, సుశీల తదితరులు పాల్గొన్నారు.
________
Telangana
*ప్రజా సమస్యలు పట్టించుకోని పాలకులపై పోరాటం కొనసాగిస్తాం* --------- * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీల అమలుకు సీపీఐ ప్రచార జాత ప్రారంభం --------
Quick Summary:
*కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు*
