Telangana
*ఎండపల్లిలో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు* * ఫోటోగ్రఫీ రంగం విశిష్టతను వివరించిన గ్రాఫర్లు
Quick Summary:
ఫోటోగ్రఫీ రంగం విశిష్టతను వివరించిన గ్రాఫర్లు
*నేటి సాక్షి, ఎండపల్లి:* కెమెరాలో ఓ క్షణాన్ని బంధించడం మాత్రమే కాదు.. జ్ఞాపకాలు, సంఘటనలు, చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడమే ఫోటోగ్రఫీ అని ఫోటో, వీడియో గ్రాఫర్లు పేర్కొన్నారు. ప్రపంచ 187వ ఫోటోగ్రఫీ డే సందర్భంగా బుధవారం ఎండపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి ఫోటోగ్రఫీ రంగానికి సేవలందించిన మహనీయులను స్మరించుకున్నారు. ఫ్రెంచ్ ఆవిష్కర్త జోసెఫ్ నిసెఫోర్ నీప్స్ 1826లో ప్రపంచంలోనే తొలి శాశ్వత ఛాయాచిత్రాన్ని రూపొందించారని తెలిపారు. లూయిస్ డాగ్యురే అభివృద్ధి చేసిన డాగ్యురోటైప్ ప్రక్రియతో ఫోటోగ్రఫీ సామాన్యులకు చేరువైందన్నారు. భారతీయ ఫోటోగ్రఫీ పితామహుడిగా రాజా దీన్ దయాళ్‌ను గౌరవిస్తారని, ఆయన ఛాయాచిత్రాలు అప్పటి సామాజిక పరిస్థితులు, ప్రముఖులు, చారిత్రక కట్టడాలు, ప్రజా జీవనానికి ఆధారాలుగా నిలిచాయని పేర్కొన్నారు. వార్తా రంగంలో సైతం ఫోటోగ్రఫీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, సంఘటన స్థలంలో ఫోటోగ్రాఫర్ సమయస్ఫూర్తితో తీసే చిత్రం వాస్తవ పరిస్థితులను ప్రజల కళ్లకు కడుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఛాయాచిత్రాలు చారిత్రక ఆధారాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ఫోటోగ్రాఫర్ పరిశీలనా శక్తి, నైపుణ్యం, సమయస్ఫూర్తి, బాధ్యత కీలకమన్నారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల అధ్యక్షులు వేముల ఉదయ్, ఎలేటి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు పోరండ్ల వెంకటేష్, శెట్టి సాగర్, కోశాధికారులు ఉపారపు నాగరాజు, నిమ్మ కృపాకర్‌తో పాటు కార్యవర్గ సభ్యులు, ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.