నేటి సాక్షి,మునగాల
ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామపంచాయతీ కార్మికులను పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోంపంగు రాధాకృష్ణ ప్రభుత్వాన్ని నిలదీశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే సహించేది లేదని, హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మునగాల ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన దీక్ష బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీఓ నరేష్‌కు కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం దీక్షా శిబిరంలో రాధాకృష్ణ మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న పంచాయతీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడటం సరికాదన్నారు.
*మల్టీపర్పస్ పేరుతో మోసం వద్దు*
మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి కార్మికులకు గతంలో ఉన్న అటెండర్, వాచ్‌మెన్, స్వీపర్, బిల్ కలెక్టర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్ తదితర కేటగిరీల విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, రెండో పీఆర్సీలో కార్మికులకు గుర్తింపు కల్పించాలని అన్నారు.
*జీతాల కోసం ఎదురుచూపులెందుకు* ?
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జీతాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి జీతాల కోసం కార్మికులు ఎదురుచూసే పరిస్థితిని ప్రభుత్వం వెంటనే మార్చాలని అన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు కాకుండా మిగిలిపోయిన కార్మికుల పేర్లను తక్షణమే నమోదు చేయాలని కోరారు.
*తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి*
కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ కారణాలతో విధుల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు. అనారోగ్యానికి గురైన లేదా మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు.
*ఇందిరమ్మ ఇళ్లు.. ఇన్సూరెన్స్ కల్పించాలి*
గ్రామపంచాయతీ కార్మికుల్లో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నందున అర్హులైన కార్మికులందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.
*మాట తప్పితే పోరాటం తప్పదు*
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హత కలిగిన కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కార్మికుల సమస్యలపై స్పందించాలని అన్నారు. హామీల అమలులో మరింత జాప్యం చేస్తే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు.
కార్మికుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, జిల్లా నాయకులు మామిడి వెంకన్న, మండల నాయకులు టి.చంద్రశేఖర్, డి.వస్రం, డి.రవికుమార్, జె.బజార్, బి.సైదా, ఆర్.గోపయ్య, కే.పరిష రాములు, రేణుక, ఉదయమ్మ, మరియమ్మ, రాములమ్మ, సైదమ్మ, సీహెచ్.వెంకటేశ్వర్లు, కే.సీతారాములు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
హామీలు అమలు చేయకుంటే ఉద్యమమే సమాధానం.. పంచాయతీ కార్మికుల సహనాన్ని పరీక్షించొద్దు.. మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పర్మినెంట్ చేయాలి.. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి --- సోంపంగు రాధాకృష్ణ
Quick Summary:
సోంపంగు రాధాకృష్ణ