* మంత్రి అడ్లూరికి ఎండపల్లి గ్రామస్తుల వినతి
*నేటి సాక్షి, ఎండపల్లి:* మండల కేంద్రంలోనే ప్రభుత్వ కార్యాలయాల భవనాలను నిర్మించాలని ఎండపల్లి గ్రామస్తులు మంత్రిని కోరారు. ఈ మేరకు సర్పంచ్ మారం సునీత- జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, వివిధ కుల సంఘాల నాయకులు శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో గ్రామస్తులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే వివిధ శాఖల సేవలు ప్రజలకు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో సమయం, వ్యయంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని మండల కేంద్రంలోనే చేపట్టాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ప్రజా అభిప్రాయం మేరకు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సర్పంచ్ మారం సునీత- జలంధర్ రెడ్డి, గ్రామస్తులు కలిసి ఎండపల్లి మండల కేంద్రంలోని జొన్నల రాసి గుట్ట సమీపంలో 146 సర్వే నెంబర్లో ఉన్న సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఈ స్థలం అనువుగా ఉంటుందని సూచించారు. ప్రధాన రహదారికి సమీపంలో స్థలం ఉండటంతో ప్రజల రాకపోకలకు, వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు.
Telangana
*మండల కేంద్రంలోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలి*
Quick Summary:
మంత్రి అడ్లూరికి ఎండపల్లి గ్రామస్తుల వినతి